స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress

Image
AMMA-DATE:1964-06-12 ఎమ్. సుగుణ M. Suguna ఆంధ్రపత్రిక వారపత్రిక · 12 జూన్ 1964 · పేజీలు 14–15 · వనితాలోకం ‘ప్రత్యేక వ్యాసావళి’లో నాలుగవ వ్యాసం Andhra Patrika weekly · 12 June 1964 · pp. 14–15 · Vanitalokam, fourth essay in the “Special Essay Series” స్త్రీల వస్త్రధారణ విషయమై వ్యాసం వ్రాయమని అడిగినప్పుడు కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం. “పురుషులలో రకరకాల దుస్తులు వస్తున్నాయి” అని కూడా అన్నారు కదా! మన స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం తక్కువనీ, స్త్రీల విషయంలో మార్పు అసంభవమా? అని కూడా ప్రశ్నించారు. అసంభవమన్నది లేదు. ఎందుకంటారా? వస్త్రధారణ అన్నది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు వేసుకోవచ్చును. కానీ వారికి కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ఉండాలి. ఉదా: [పరడా] కొడ్డీ పంజాబీ దుస్తులు వేసుకున్నామనుకోండి. అవి వేసుకుని బజారుకో, కాలేజీకో వెళితే వెనక నుంచి వచ్చే సూటిపోటి మాటలు, వేళాకోళాలు, పరిహాసాలు అన్నీ సహింపగల ధైర్యం ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇందులో ఒక సంఘటన చెబుతానా?... పంజాబ్‌లో మేమున్న ఊళ్ళో మేమొక్కరమే తెలుగు వారము. వెళ్ళిన కొత్తలో మా చెల్లెలు పావడా, ఓణీ వేసుకుని రిక్షాలో స్కూల్‌కి వెళ్త...

ఉత్తర భారత్‌లోని ముఖ్యమైన పండుగలు · The Major Festivals of North India

ఎం. సుగుణ

ఆంధ్రపత్రిక వారపత్రిక · 1-11-1963 · వనితాలోకం

పండుగ వస్తోందంటే చాలా ఆబాలగోపాలానికీ సంతోషమే. రోజులు లెక్కిస్తుంటారు. పండుగ ఎప్పుడొస్తుందా అని, అన్నిభాషలవారూ ఎదురుచూస్తారు కదా! కాని, ఆ జరిపే తీరే వేరుగా ఉంటాయి. వారి ఆచారాన్ని అనుసరించి. మనకి ముఖ్య పండుగ సంక్రాంతి తరువాత దీపావళి, దసరా, ఉగాది మొదలగునవి. ఉత్తర దేశంలో ముఖ్యమైన పండుగలు నాలుగు. దసరా, దీపావళి, హోళీ, రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అన్నది మన శ్రావణ పౌర్ణమి. పండుగలు ఎలా జరుపుతారో రాస్తాను. ముందుగా దసరా పండుగ.

దసరా పండుగ మనలాగా బొమ్మలకొలువు పేరంటం ఉండదు. అసలు ఇళ్ళల్లో అట్టహాసమే ఉండదు. పైగా కొంతమంది ఏ ప్రాంతానికా ప్రాంతంవారు (కోలనీ) చందాలు వేసుకొని ఎలాగేనా సరే “రామ్‌లీలా” ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా అంటే రామాయణ గాథనే వేదికమీద ప్రదర్శిస్తారన్నమాట. ఢిల్లీలో ఈ రామ్‌లీలా కోసమని రామ్‌లీలా మైదాన్ అనే పెద్ద మైదానం ఉంది. అక్కడ ‘రామ్‌లీల’ ని సుమారు లక్షమంది ప్రజ చూస్తారేమో! ఈ రామ్‌లీలాకి చాలా ధనం వ్యయం చేస్తారు.

మొదటిరోజు విఘ్నేశ్వరపూజ మొదలుకొని, రామలక్ష్మణులు విద్యనభ్యసించటం, సీతా పరిణయం, అన్నీ రోజూ రామాయణకథ మొత్తాన్నీ టూకీగా దసరా పదిరోజులూ వేస్తారు. ఇవి పెద్దపెద్దవి ఉంటాయి. చిన్నచిన్నవైతే మనుష్యులే వేషాలేసుకుని ఆడతారు. కొన్ని మన తోలుబొమ్మల్లాగా ఆడిస్తారు. ఆఖరిరోజున రావణాసురుడ్ని చంపుతారు. ఆరోజు రావణాసురుని బొమ్మలాగ పెద్దది పది తలలవి పెట్టి చేసి లోపలంతా మందుగుండు సామాను పెడతారు. ఆఖరికి రావణాసురుడి దహనము అన్నమాట. రావణాసురుడ్ని కాల్చగానే పెద్ద శబ్దాలతోనూ పంచరంగులతో వింత కాంతులు వెదజల్లుతూ పేలుతుంది. ఇది చూసేందుకు ప్రజా విరగపడతారు. ఇది ముఖ్యం.

ఇంక దీపావళి, దీనికి దివాళీ అంటారు. మనలాగే బాణాసంచా కాలుస్తారు. ఆరోజు బజారుల్లో కెళ్తే బాగుంటుంది. ఢిల్లీలో కరోల్‌బాగ్‌లో అజ్మల్‌ఖాన్ రోడ్డు అని ఉంది. ఆ రోడ్డంతా బజారే…. ఆరోజుకి, రకరకాల బొమ్మలు అమ్ముతారు. మిఠాయికొట్లు ఆరోజు చూసితీరాలి.

మనం బొమ్మలకొలువుకి అంతస్తులు పేర్చి బొమ్మలెలా పెడతామో అలాగే అంతస్తులు వేసి రకరకాల మిఠాయిలు వివిధ రంగులో పేర్చి అమ్ముతారు. ఇంక వాళ్ళ పనితనం మనకి ఆరోజు అర్థమవుతుంది. బర్ఫీ మొదలగు స్వీట్లతో పెద్ద మేడలు, గడియారపు స్తంభాలు (క్లాక్ టవర్స్) అవీ రకరకాలు చేసి పై అంతస్తులో పెట్టి లోపల బల్బు వెలిగిస్తారు. రసగుల్లా తయారు చేస్తారే, ఆ పాల విరుగుని “చేనా” అంటారు.

ఆ చేనాతో అన్ని రకాల ఫలాలు, కాయగూరలు బర్ఫీతో కూడా చేస్తారు. ఒక సంవత్సరం అయితే, ఆ చేనాతో పచ్చని జీడిపండు (కింద జీడిపిక్క) ఒక బొప్పాయి పండు కూడా చేసి మధ్యకి తరిగి ఉంచేరు. పైన తొక్కలాగ ఆకుపచ్చ రంగు, లోపల పచ్చరంగులో పండు, నల్లని రంగులో గింజలు, ఎంతో అందంగా తయారు చేసేరు. అది చూస్తున్నంతసేపూ మిఠాయి అనే మాట మరచిపోయాము. అలాగే యాపిలు పళ్ళు, ఆలూబుఖారా పళ్ళు, ఎన్నో రకాలు రంగులువేసి చూడ ముచ్చటగా, అందర్నీ ఆకర్షించి కొనేటట్లు చేస్తాయి మిఠాయి దుకాణాలు.

ఇవి కాగా పంచదార పాకంపట్టి, చిన్న పొంగులు, గడియారపు స్తంభాలు, చిన్న చిలుకలు, జంతువులూ తయారుచేసి తోపుడు బళ్ళమీద కుప్పలుపోసి అమ్ముతారు. నువ్వులపప్పుతో రేవడీ, (మన ప్రక్క బెల్లమో, పంచదారో వేసి పాకం పట్టిన జీళ్ళు అంటామే అవి) కుప్పలు కుప్పలుగా పోసి, నువ్వుల పప్పు దంచి పంచదార కలిపి పల్చగా రేకుల్లా చేస్తారు. అవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.

ఇవన్నీ ఆరోజు ప్రత్యేకంగా అమ్ముతారు. అందరూ ఇవన్నీ తలో కాస్త కొనుక్కుని స్నేహితులకీ, బంధువులకీ అన్ని రకాలూ పళ్ళెంనిండా పేర్చి అందరికీ పంచుతారు. వీటితోపాటు జొన్నపేలాలు కూడా కొంతమంది పంచుతారు. మిఠాయిలన్నీ రకానికొక్కటి చొప్పున వేసి శేర్ల లెక్కను అమ్ముతారు….

ప్రమిదలు రకరకాలు, చిన్న గుడిగోపురంలాగు కుండతో చేసి రంగువేసి దాన్నిండా దీపాలు పెట్టుకునేందుకు ప్రమిదలు అమరుస్తారు. ఆరోజు ఇత్తడిపాత్ర సామాను కూడా చాలా అమ్ముతారు. కొంతమంది ఏదేనా ఇత్తడిపాత్ర కొంటారు. సాయంత్రం లక్ష్మీపూజ చేసుకుంటారు. వెండి రూపాయి నాణేన్ని సంచిలో పోసి దాచుకుని ప్రతీ ఏటా ఆ నాణేన్ని కూడా పూజిస్తారు కొందరు.

ఇంకా బాణాసంచా (మందుగుండు సామాను) అమ్మే దుకాణాలు ఆరోజు ప్రత్యేకాలంకరణలు. అందరూ బజార్లో తిరిగి ఇంట్లో దీపాలు పెట్టుకుని పటాకీలు కాల్చుకుంటారు. ఢిల్లీలో బజార్లన్నీ బాగా దీపాలతో అలంకరిస్తారు. ఈ మిఠాయి దుకాణాలయితే చాలా ఉంటాయి. మిఠాయిల పేర్లు మనకి ఎన్నో తెలియనివి, గమ్మత్తయినవి ఉంటాయి. కొన్ని తమాషా పేర్లు రాస్తానూ, “చమ్ చమ్”, “రస్మలాయి”, “దిల్‌బహార్”, బాదుషా, “అమృతి” (ఇది మనం చేసుకునే జహంగీరు) “సోహన్ హల్వా” ఇలా ఎన్నో ఉన్నాయి. పండగ ఇంట్లోనే కాక బయట కూడా జరుపుకుంటారన్నమాట.

మార్చి నెలలో వస్తుంది హోళీ…. ‘హోళికా’ పూర్ణిమ. ఈ పండుగ వస్తుందనగా పది పదిహేను రోజుల ముందర్నించీ, ఇటుక, ఇసుక మొదలగు బాడుగకిచ్చే లారీలలోని కూలీలు డప్పులు పట్టుకుని వాయిస్తూ, గెంతుతుంటారు. డప్పులు లేక పోతే ఓ పళ్ళెంకే వాయిస్తూ, లారీలలో వెళ్తుంటారు. ఆ వాయిద్యాలు వింటుంటే ‘అదో హోళీ వస్తోంది’ అనుకుంటాము. ఈ పండుగ రెండు రోజులు జరుపుకుంటారు. ఒకరోజు రాత్రి మనం భోగిమంట వేసినట్టు వేసి (దానికి లోడీ అంటారు) కర్రలన్నీ పేర్చి నీళ్ళు జల్లి కొంతమంది వనితలు పూజచేస్తారు. ఆ తరువాత మంట పెడతారు.

మొదటిరోజున రంగు, గుండలు ఎరుపు, ఆకు పచ్చ, వీటిలో అభ్రకం (మైకా) కొంచెం కలుపుతారు. ఈ గుండల్ని గులాల్ అంటారు. అందరూ చేతిలో ఈ రంగు, గులాల్ పట్టుకుని స్నేహితుల ఇళ్ళక్కీ, బంధువుల ఇళ్ళక్కీ వెళ్ళి ప్రతివారూ ఒకరి కొకరు ఈ రంగు ముఖానికీ తలకీ పూసుకుని బట్టలకి కూడా పూసి ఒకరి కొకరు కౌగిలించుకుని ఈ భుజంమీదా, ఆ భుజంమీదా తల ఒకసారి ఆనిస్తారు. మగవారు, స్త్రీలు, వేరువేరుగా గుంపులు గుంపులుగా బయలుదేరి అందరిళ్ళకీ వెళ్ళి రంగులు పూసుకుంటారు. అందరిళ్ళూ అయ్యేక అంతా కలిసి డోలు వాయిస్తూ అందరూ పాడుతుంటే ఒక్కొక్కరే కాళ్ళకి గజ్జకట్టి నృత్యం చేస్తారు. మనకి నృత్యం రాకపోయినా సరే ఎలాగో నాలుగు కుప్పిగంతులేనా వేసెయ్యాలి. ఈ పాటలూ, నృత్యాలూ కూడా స్త్రీలు, పురుషులూ వేరు వేరు బృందాలుగా ఆడుతారు. ఆరోజు పై ఆఫీసరని గాని కార్మికుడు అని గాని భేదం ఉండదు. అందరూ తమ తమ అంతస్తులు మరచి హాయిగా కులాసాగా ఆడుకుంటారు. ఈ రంగులు పూసుకోటం మధ్యాహ్నం ఒంటిగంట రెండు గంటల వరకే ఆడతారు. ఆ తరువాత స్నానాలు చేసేస్తారు. స్నానం చేసేక ఎవరూ ఆడరు.

రెండవరోజు రంగునీళ్ళు పిచికార్లతోనూ, చెంబులతోనూ చేతికందిన దాంతో నెత్తిమీంచి ఒకరి కొకరు దిమ్మరించుకోటమే. ఇందులో ఎంత … ఆడుకుంటారంటే చెప్పులతో మాలచేసి ఆఫీసర్ల మెడలో వేయటం, బిందెల్తో చిక్కని రంగునీళ్ళు నెత్తిమీంచి దిమ్మరించటం. ఇంక చూసుకోండి ఆ రూపులు ఎలాగుంటాయో! ఎవరేనా కాస్త లేతరంగుల్లో కనిపించేరంటే వాళ్ళ పని అయిందన్నమాట. అందరూ కలిసి వాళ్ళ పని పట్టారు. ఈ రంగునీళ్ళు ముందురోజు రాత్రి పెద్ద డ్రమ్ములోనూ వాటిల్లోనూ కలిపి ఉంచుకుంటారు. పిచికార్లతో ముఖంమీద నూటిగా కొడతారు. అప్పుడు ఒళ్ళు అప్పజెప్పి ఊరుకోడం కన్నా చేసేదేం లేదు. ఈ పండగలో కూడా మిఠాయిలు ఇచ్చుకుంటారు.

ఇలాంటి పండగలంటే పిల్లలకి ఒకటే పండగ. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నేరేడుపండు రంగు మొదలగు రంగులన్నీ తెచ్చి నీళ్ళలో కలపటం…. ‘ప్రక్కింటి రమేష్ కంటె నేనే ఎక్కువ కలిపేను తెల్సా! ఈసారి వాడి పని పట్టెయ్యాలి. రంగులో ముంచెయ్యాలి.’ అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు పిల్లలు.

కొంతమంది పిల్లలు కలసి ఒక ఖాళీ పర్సుని, జనసమర్థం ఉన్న వీధిలో గిరవాటేసి ప్రక్కగా నక్కి దాక్కుంటారు. పర్సు చూడగానే ఎవరికేనా ఆశేగదా! వంగి పర్సు తీయబోయేసరికి కుర్రజట్టంతా అతనిచుట్టూ మూగి — ‘ఏయ్! పర్సు దొరికితే తీసుకుంటావా? ఆశ…. కాని హోళీకి చందా ఇయ్యి’ అని దండెత్తుతారు. ఆ పెద్దమనిషి ముందు తెల్లబోయినా పిల్లల యుక్తికి మెచ్చి వాళ్ళ చేతిలో ఏదో పెట్టి నవ్వుకుంటూ ముందుకి అడుగు వేస్తాడు. మళ్ళీ నాటకం మొదలు…. ఇలా సంపాదిస్తారు వీధిలోని పిల్లలు. ఈ రంగులు జల్లుకోటమే హోళీ…. సరదాగా ఉంటుంది. రూపులు మాత్రం…. అబ్బ! ముఖమూ, తలా, బట్టలూ ఎక్కడా ఒక రంగని చెప్పడానికి వీలులేనన్ని రంగులు. ముఖం నిండా రంగులతో నిండిఉంటే నోట్లోని పలువరుస తెల్లగా మెరుస్తూ ఉంటే కళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి. చిన్నపాపలైతే తండ్రిని కూడా పోలిక పట్టలేదు. పైగా, భయంతో అరుస్తూ ఒకటే ఆలాపిస్తారు.

మా నాన్నగారు బట్టల మిల్లులో పని చేస్తున్నారు. ఆ మిల్లులో ఒకరోజు హోళీ ఆడతారు. ఎన్నివేల మంది కార్మికులుంటే అన్నివేల మందీ ఆఫీసర్లందరికీ రాస్తారు. అంటే ఏవిభాగంకి ఆ విభాగం ఆడతారనుకోండి. ఒక ఆఫీసరు ఒక విభాగాని కెళ్ళి ఒక బల్లముందు నిలబడతారు. బల్లమీద రంగు, గుండ ఉంచుతారు. ఆ విభాగంలోని పనివారంతా ఒక్కొక్కరే వచ్చి ఆఫీసరు కింత రంగు పూసి మెడలో పూలమాల వేసి కౌగిలించుకుని నోట్లో ఏదేనా తీపి పెడతారు. అలాగే ఆఫీసరు కూడా ప్రతి వారికీ రంగు పూసి కౌగిలించుకుంటారు. ఇలా అన్ని విభాగాలలోకీ అందరూ వెళ్ళి తమ స్నేహభావాన్ని పెంపొందించుకుంటారు.

ఇంక రక్షాబంధన్, ఇది ముఖ్యంగా తోబుట్టువులు జరుపుకుంటారు. అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల్ని తమ రక్ష కోరుతూ అన్నదమ్ముల చేతికి రక్షాబంధన్ కడతారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళకి ఏమేనా కానుక ఇస్తారు. ఇలా స్నేహితులు కూడా స్నేహాభివృద్ధికి ఒకరి కొకరు కట్టుకుని మిఠాయి ఇస్తారు. ఈ రక్షాబంధన్‌లు బజార్లో రకరకాల పువ్వులు, లతలు, అవీ చెమ్కీలతో రంగురంగుల్లో అమ్ముతారు. ఈ రక్షాబంధన్‌కి సాధారణంగా పుట్టింటికి వెళ్తారు స్త్రీలు…. ఆనందోత్సాహాలతో చలోక్తులు విసురుకుంటూ రక్ష కోరుతారు. ఈ పండగలన్నీ హృదయాన్ని ఆనందపరుస్తాయి.

Cartoon by Jayadev: Holi

“ఏది… బావగారూ! ఆఖరిసారిగా ఒక్క-సారి నవ్వండి చూద్దాం!!”

బొమ్మ: జయదేవ్

Comments

Popular posts from this blog

The Art of Rama's Pattabhishekham (Rajyabhisheka)

Śikṣā: Phonetics of the Gods