స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం · Variety in Women’s Dress


ఎమ్. సుగుణ
M. Suguna
ఆంధ్రపత్రిక వారపత్రిక · 12 జూన్ 1964 · పేజీలు 14–15 · వనితాలోకం ‘ప్రత్యేక వ్యాసావళి’లో నాలుగవ వ్యాసం
Andhra Patrika weekly · 12 June 1964 · pp. 14–15 · Vanitalokam, fourth essay in the “Special Essay Series”
స్త్రీల వస్త్రధారణ విషయమై వ్యాసం వ్రాయమని అడిగినప్పుడు కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం.
“పురుషులలో రకరకాల దుస్తులు వస్తున్నాయి” అని కూడా అన్నారు కదా! మన స్త్రీల వస్త్రధారణలో వైవిధ్యం తక్కువనీ, స్త్రీల విషయంలో మార్పు అసంభవమా? అని కూడా ప్రశ్నించారు. అసంభవమన్నది లేదు.
ఎందుకంటారా? వస్త్రధారణ అన్నది వ్యక్తిగత విషయం. ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు వేసుకోవచ్చును. కానీ వారికి కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ఉండాలి.
ఉదా: [పరడా] కొడ్డీ పంజాబీ దుస్తులు వేసుకున్నామనుకోండి. అవి వేసుకుని బజారుకో, కాలేజీకో వెళితే వెనక నుంచి వచ్చే సూటిపోటి మాటలు, వేళాకోళాలు, పరిహాసాలు అన్నీ సహింపగల ధైర్యం ఉన్నప్పుడే వేసుకోవాలి.
ఇందులో ఒక సంఘటన చెబుతానా?... పంజాబ్‌లో మేమున్న ఊళ్ళో మేమొక్కరమే తెలుగు వారము. వెళ్ళిన కొత్తలో మా చెల్లెలు పావడా, ఓణీ వేసుకుని రిక్షాలో స్కూల్‌కి వెళ్తోంది. ఇంక దాన్ని చూసి ఒకటే కేకలు, సినిమా స్టార్లా వేషం అంటూ (వాళ్ళ ఉద్దేశ్యంలో సినిమాతారలే పావడా ఓణీ వేసుకుంటారని). అప్పట్నుంచి ఇంట్లో తప్ప, పావడా, ఓణీతో మరి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్తే చీర, చోళీ, లేక పంజాబీ దుస్తులు. ఇంక దాని వంక చూడటం మానేశారు. ఇలాటి పరిస్థితులలో మనం మారాలి.
ఇంక వస్త్రధారణబట్టీ, ఫలానా ప్రాంతం వారని నిర్ణయిస్తాం. ప్రతి భాషా, ప్రాంతం వారికి కట్టూ బొట్టూలో తేడా ఉంటుంది.
గుజరాతీలు, ఉత్తర హిందూస్థాన్ వారు, జైన్ మతస్థులు చీరకట్టి ముందుకి పమిట వేసుకుంటారు. శిరస్సున కొంగు కప్పుకుంటారు. (ఇప్పుడంత లేదనుకోండి) ఇలాగే మహారాష్ట్రపు వనితలు చక్కగా చీరెని గోచీ పోసి కట్టుకుంటారు. ఈ కట్టు మంచి ఒడ్డు, పొడుగు ఉన్నవారికి అందంగా, హుందాగా అమరుతుంది.
బెంగాలీలు, ఒరిస్సా పడతులు కూడా ప్రత్యేకమైన కట్టు. ముందుకి చీరకుచ్చెలు లేకుండా చుట్టబెట్టినట్లు కట్టుకుని తలపై మునుగు వేసుకుని ఆ కొంగునే భుజం మీదికి వేసుకుంటారు. అలాగే పంజాబీలు సల్వార్, కమీజు వేసుకుని పైన దుప్పట్టా కప్పుకుంటారు కదా!
ఇంక తమిళ వనితలకి తొమ్మిది గజాల చీరా కావాలి. వీరు చీరెని బాగా చుట్టుకుని ఒక పక్కకి కుచ్చెనలు వచ్చినట్లు అడ్డ కచ్చ పోసి కట్టారు. కొంకణీ వారు మనలాగా కాకుండా చీర కొంగుని ముందు చేతుల కింద నుండి తీసి వెనుక భుజంపైనుండి పమిట తీసి ముందుకి ముడివేస్తారు. చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది.
ప్రతి ప్రాంతం వారికీ ప్రాంతీయ కట్టూ, బొట్టూ ఉన్నా, చాలా మంది నాగరికత వల్లనైతేనేం, ఆర్థికంగానైతేనేం ఆరు గజాల చీరెలు, గూడ కట్టు కడుతున్నారు. మన ఆంధ్రదేశంలో ఈ కట్టే అందరికీ వాడుకలో ఉన్నది. అంటే అన్ని ప్రాంతాల వారికీ ఈ కట్టు వచ్చిందనుకుంటాను.
మన ఆంధ్రదేశంలో కూడా చీరే కట్టినా రకరకాల కట్లు కట్టుకుంటారు. బ్రాహ్మణులంతా పూజా పునస్కారాలకి మన పెద్దవారు కట్టినట్లుగా కచ్చపోసి కట్టవలసిందే కదా! అంటే ఆ కట్టే ఆచారమన్న మాటకదా! బ్రాహ్మణులలోనే ద్రావిళ్ళు తొమ్మిది గజాల చీర కుడి పక్క పమిట వేసి, వేరే విధంగా కట్టుకుంటారు.
ఇంక మన పల్లెల ప్రాంతాలలో వివిధ రకాలు. అంటే దేశమంతా స్త్రీల వస్త్రధారణలో వివిధ రకాల కట్టడం ఉంది కదా! ఇంకా దేశం మొత్తం మీద చీరెలే ఎక్కువ చలామణీలో ఉన్నాయి. ఎన్ని రకాల కట్లున్నా ఆ చీరెనే కట్టుకుంటున్నాము.
ఇదే పురుషుల విషయం తీసుకోండి. పేంటు, షర్టు, బుష్షర్టు. ఈ రెండు రకాల షర్టులోనే కూడా మన వాళ్ళ మాదిరి, “వీ నెక్”, “రౌండ్ నెక్”, “[అస్పష్టం]”, “ఆఫ్ స్లీవ్స్”, “స్క్వేర్ నెక్” మొదలగు ఫేషన్లలాగే. ముందుకి అంతా ఓపెనయిన బుష్షర్టు, కొంచెం ఓపెనయినవి, ఫుల్ హాండ్సువి, “టీ షర్ట్స్” అని రకరకాలు వస్తున్నాయి. ఇంక వీటికి మన జాకెట్టు బట్టలు కూడా కుట్టించేసుకుంటున్నారు. ఇదే కాదు ఫుల్హాండ్సు షర్టు (దండగ) వేసుకుని చేతులు సగానికి పైగా మడచివేసుకుంటారు.
ఈ వస్త్రాలు మటుకు ప్రపంచమంతా ఏ కొద్ది మార్పుతోనో ఇవే వాడుక. ఇందులోనే పేంట్ల ఆకారం (అదే ఫేషను) కొన్నాళ్ళు వదులుగా ఉంటే కొన్నాళ్ళు కాళ్ళకి బంధాలు మాదిరి ఫిట్‌గా ఉంటాయి. ఈ ఫేషన్లన్నీ సినిమాల ద్వారా మారుతుంటాయి.
ఇంక కాలేజీ విద్యార్థులు వేసే వస్త్రాలు ఎన్ని రకాలో చెప్పలేము. విద్యార్థులు, అధ్యాపకులు మటుకు, పేంటు షర్టు, లేక బి. షర్టు (బుష్ షర్టు) మటుకే వేస్తారు. వయసులో పెద్దవారయితే పంచ కట్టారు. విద్యార్థినులలో? చీరెలు ... రకరకాల చోళీలు, స్కర్ట్లు, బ్లౌజు, పావడా, ఓణీలు, పంజాబీ దుస్తులు, ఫిట్‌గా దేహాకృతి కనిపిస్తున్నట్టు పేంట్లు (వీటికి జీన్స్ అని కూడా అంటారట) షర్టు, ఇవి కాక ఎంత పెద్ద వారయినా గౌన్లు వేసుకుంటారు. ఇవన్నీ ఇప్పటి నవనాగరికంగా
ఉండేవారు వేసుకుంటూనే ఉన్నారు. ఎన్ని రకాల వస్త్రాలంకరణ అనుకరించి వేసుకున్నా మనలో ప్రతీ స్త్రీ ఒక వయసు వచ్చేసరికి చీరె ఎన్నుకుంటుంది. మన సోదరీమణులలో నూటికి తొంభై ఎనిమిది మందికి రకరకాల చీరెల మీదే అత్యంత మోజు. స్త్రీల వస్త్రధారణలో మటుకు చాలా రకాలున్నాయి. ఎబ్బెట్టుగా ఉండకుండా ఉన్నవి ఎవరు వేసుకున్నా తప్పులేదని నా అభిప్రాయం.
మన స్త్రీలకెన్ని రకాల కట్లున్నాయో పురుషులకీ ప్రాంతీయ ఆచారానికి తగ్గట్టు, పంచ, లుంగీ, పైజామా, చూడీదార్ పైజామా (చూడీ అంటే చేతి గాజులు గాజులా కాళ్ళకి చుట్టుకుని ఉంటుంది కనుక ఆ పేరొచ్చిందనుకుంటా) లాంటివి ఇలా ఎన్నో ఉన్నాయి.
స్త్రీలకి ఉద్యోగరీత్యా కొన్ని నియమిత వస్త్రాలున్నాయి, నర్సులకీ, సైన్యంలో చేరిన వారికి, విమానంలో హోస్టెస్‌గా పని చేసే వారికీ ఇలా ఎన్నో? వారందరూ తమ డ్యూటీ అవగానే తమ ప్రాంతీయ వస్త్రాలే ధరిస్తారు.
అన్ని వస్త్రాలలోకీ ఉత్తమ, ఉన్నతమైనదీ, స్త్రీల అందాన్ని పెంపొందించేదీ అందమైన చీర, చోళీ! రకరకాల చీరెలూ, చోళీలూ వేసుకునేందుకు ఇష్టపడినట్లు మరే రకమైన వస్త్రాలంకరణకీ ఇష్టపడదు మన ఆంధ్ర వనిత (రకరకాలుగా అలంకరించుకుందికి ముందుకి వస్తారు కాని మన స్త్రీలు వస్త్రాలంకరణలో మార్పు కోరరని నా అభిప్రాయం). చిన్నప్పుడు రకరకాల వస్త్రాలు ధరించినా స్త్రీగా రూపొందిన తరువాత ఇష్టంగా చీరే కోరుకుంటుంది.
నా అభిప్రాయంతో సోదరీమణులు ఏకీభవిస్తారని ఆశిస్తాను. మనలో చాలా మంది సోదరీమణులు దూరంగా విదేశాల్లో ఉన్నవారూ వెళ్లివచ్చిన వారూ ఉన్నారు. వాళ్లంతా పాశ్చాత్య దేశం వెళ్లినా మన కట్టూ బొట్టూ మార్చుకోలేదని నా నమ్మకం.
ఇంక ఇతర ప్రాంతాల నుంచీ, దేశాల నుంచీ నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి. ఒకరి ఆచార వ్యవహారాలను నిరసనగా చూడకూడదు. మనకి నచ్చకపోతే మౌనం మంచిది. ఒకరిలో ఉన్న మంచి మర్యాద, మాట పొందిక చూసి మనం కూడా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి.
ఏ దేశం వెళ్లినా స్నేహాన్ని పెంపొందించుకుంటే పై దేశం వచ్చేమన్న బాధుండదు. విదేశాలు వెళ్లిన వనితలే అక్కడి ఆచార వ్యవహారాలను, పిల్లల పెంపకం అన్నీ వ్యాసరూపంలో మన పత్రిక ద్వారా అందిస్తూ ఉన్నారు.
అవన్నీ చదివి ఊరుకునే కంటే, ఆ చదివిన వాటిలో మనకెన్ని అందుబాటులో ఉన్నాయి? ఎన్ని సాధించగలం? అనుకుని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించినప్పుడే ఆ వ్యాసానికి ప్రాధాన్యత ఇచ్చిన వారమవుతాము. మన వనితల చర్చలకీ, అభిప్రాయాలకీ తగిన ప్రోత్సాహం, అవకాశం ఇచ్చిన పత్రికా సంపాదకులకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.

1937 వ సంవత్సరంలో శ్రీకాకుళంలో ఇంజనీరుగారింట పుట్టిన వ్యాసరచయిత్రికి వివాహం 1958 లో ‘జియోఫిజిసిస్ట్’తో అయింది. ఐదేండ్ల పాపాయికి తల్లి. భర్త ఉద్యోగరీత్యా ఆమెకు బెంగాల్, కచ్, రాజస్థాన్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు చూచే అవకాశం లభించింది. మా పత్రికకు సుపరిచితురాలయిన రచయిత్రికి “ఊళ్లు తిరిగి వింతలు విశేషాలు చూడాలనీ, పుస్తకాలు చదవాలని” సరదా ఎక్కువ!
Comments
Post a Comment